Friday, 26 May 2017

ముసుగు


ముసుగు కాషాయ బట్టలు కట్టుకున్నంత మాత్రాన ఎవడూ సన్యాసి కాడు. కాని జనం భ్రమల్లో వుంటారు. బట్టలు మార్చినంతమాత్రన మారిపోతామనుకుంటారు. ఈ మారిపోవడం కూడా మరిదేన్నో పొందడానికే అయివుంది. అన్నింటినీ వదులుకోవడం అంత సులభం కాదు. మనుషులు అభిప్రాయాల్ని మార్చుకుంటారు. కానీ అభిప్రాయాల్ని వదులుకోరు. పైపైన మారడం సులభం. లోపలి మార్పు కష్టం. మార్పు లేని తనాన్ని కప్పిపుచ్చడానికి మనుషులు ముసుగులు వేసుకుంటారు. ముసుగులు మారుస్తారు. మారిన ముసుగుల్ని చూసిన జనం వీళ్లు మారిపోయారనుకుంటారు. సత్యాన్ని గ్రహించాలనుకున్న వ్యక్తి దాన్ని తెలుసుకునేదాకా వదిలి పెట్టడు. సత్యాన్ని తెలుసుకోవడమంటే ఏది వాస్తవమో, ఏది కాదో దాన్ని తెలుసుకోవడం, ఉన్నదాన్ని దర్శించడం వల్ల సత్యం ఆవిష్కారమవుతుంది. తనను తాను తెలుసుకోవడమే సత్యం. ఆ అన్వేషి మార్పుల వెంట పరుగు తీయడు. ఇప్పుడు ఈ క్షణం జీవిస్తాడు. ఒక నగరంలో గొప్ప ధనవంతుడు వుండేవాడు. అతను దేశంలోనే గొప్ప సంపన్నుడు. నిరంతరం ధన సంపాదనలోనే మునిగి వుండేవాడు. సంపాదించడం, సంపాదించిన దాన్ని కూడబెట్టుకోవడం తప్ప అతనికి మరో చింతన లేదు. సాధారణంగా సంపన్నులకు గొప్పవాళ్లతో సంబంధాలుంటాయి. అట్లాగే ఆ ధనవంతుడికి ఆ దేశం రాజుతో సంబంధాలున్నాయి. ఒక సందర్భంలో ఎవరికీ ఏ లోటూ కలగకుండా ధనవంతుడు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాడు. అతని ఐశ్వర్యానికి విస్తుపోతూ రాజు పరివారం విందువినోదాల్లో మునిగింది. రాచకుటుంబానికి ప్రత్యేక ఏర్పాట్లు వుంటాయి కదా! తన మందిరంలో ధనవంతుడు రాజుగారికి బస కల్పించాడు. తను కూడా రాజుగారితో బాటు కూచున్నాడు. సేవకులందరూ సపర్యలు చేస్తున్నారు. పంచభక్ష్యపరమాన్నాలు వడ్డిస్తున్నారు. యింతలో ఒక పనివాడి చేతిలోంచి వేడివేడి పళ్ళెం అన్నంతో సహా కింద పడింది. ఆ పడడం ధనవంతుడి కాలిమీద పడింది. ఆ వేడికి ధనవంతుడి కాలు కాలి బొబ్బలు లేచాయి. ధనవంతుడి కోపం కట్టలు తెంచుకుంది. ఆ పనివాణ్ణి చంపాలన్నంత కోపం వచ్చింది. తన పని ముగిసిపోయిందనుకున్న పనివాడు ధనవంతుడి ఆగ్రహాన్ని చూసి తన ప్రయత్నం తను చేద్దామనుకుని ”ఎవరయితే తన కోపాన్ని జయిస్తాడో అతను స్వర్గానికి వెళతాడు” అన్నాడు. అందరికీ వినిపించేంతగా. ఆ మాటతో ధనవంతుడు కోపాన్ని దిగమింగుకుని చిరునవ్వు నటించాడు. అతని సహనానికి రాజు కూడా అభినందించాడు. పనివాడు ”క్షమించే తత్త్వమున్న వాళ్ళకే స్వర్గ ప్రాప్తి” అన్నాడు. ధనవంతుడు ఆగ్రహాన్ని అణిచిపెట్టి అందరూ వినేలా ”నిన్ను క్షమించాను” అని పనివాడితో అన్నాడు. పనివాడు ఊపిరిపీల్చుకుని ”దయాగుణం ఉన్న వాళ్ళనే దైవం ప్రేమిస్తాడు.” అన్నాడు. ధనవంతుడు ” నీకు స్వేచ్ఛనిస్తున్నాను. ఈ ధనం తీసుకుని వెళ్ళు. నీ యిష్టమొచ్చినట్లు జీవించు” అని డబ్బుసంచిని యిచ్చి పంపించాడు. అందరి దృష్టిలో ధనవంతుడు మహాపురుషుడయ్యాడు. ఆ నగరంలోనే కాదు దేశమంతా ధనవంతుని కీర్తి వ్యాపించింది. అప్పటిదాకా అతన్లో ఉన్న కోపం,అహంకారం,పగ, లోభి గుణం హఠాత్తుగా రంగు మార్చుకున్నాయి. శాంతం, దానగుణం, దయాశీలంగా మారిపోయాయి. లోకమే అతని పరివర్తనకు విస్తుపోయింది. అనుకూలాన్ని బట్టి అతని ముసుగులు మారిపోయాయి. కోపం శాంతంగా మారింది. ప్రతికారం దయాగుణంగా మారింది. యీ మార్పులు నిజమైన మార్పులా? అన్నీ అహం కేంద్రంగా వున్నవి కావా? అభినందనల్ని ఆధారం చేసుకున్నవి కావా? ధర్మమన్నది అంత చవగ్గా దొరికితే ప్రతివాడూ ధర్మాత్ముడయి పోతాడు. మనిషి చెయ్యాల్సింది ముసుగులు తగిలించుకోవడం కాదు. రకరకాల ముసుగుల్ని మార్చుకోవడం కాదు. క్రమక్రమంగా అన్ని ముసుగుల్ని వదిలించుకోవడమన్నదే నిజమైన వైరాగ్యం. సన్యాసం.

సన్యాసం


సన్యాసం ఓసారి ఒక యువకుడు నా దగ్గరికి వచ్చాడు. అతను సత్యాన్వేషణలో ఉన్నాడు. సన్యాసాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ”స్వామీ! నేను సన్యాసం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అన్ని రకాలయిన అర్హతలు సంపాదించాను. నాకు సన్యాసాన్ని ఇప్పించండి” అని అడిగాడు. ”నేను మనుషులు సంసారం కోసం సిద్దపడడం విన్నాను. సన్యాసం కోసం సిద్ధపడడమంటే?” అన్నాను. ”ఇంకా ఇట్లా అన్నీ సిద్ధం చేసుకున్న సన్యాసం సన్యాసమెలా అవుతుంది? సన్యాసమంటే వేషం మార్చుకోవడం, పేరు మార్చుకోవడం కాదు. సంసారాన్ని వదిలి పారిపోవడం కాదు. సన్యాసమంటే ఆలోచనల్లో మార్పు రావడం. పరివర్తన కలగడం. ఈ పరివర్తన అన్నది సంసారంలో విఫలమయితే తప్ప సంసారంలో సాధించలేకపోతే తప్ప చివరి అంచయిన సన్యాసానికి రాలేవు. సంసారం, సన్యాసం వేరు వేరు కావు. అవి ఒకే నాణేనికి రెండు వేపులు” అన్నాను. ఆ మాటల్తో ఆ యువకుడు ఖిన్నుడయ్యాడు. తను అడియాసలో కూరుకుపోయాడు. కన్నీళ్ల పర్యంతమయ్యాడు. నిస్సహాయంగా మాటా, పలుకూ లేకుండా వెనుదిరిగాడు. అతన్ని ఆపి అతనికోకథ చెప్పాను. ”నువ్వీ కథ విను. విన్న తరువాత అప్పటికీ నీకు సన్యాసం స్వీకరించాలని ఉంటే నీకు సన్యాసమివ్వటానికి నాకు అభ్యంతరం లేదు. సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదని నువ్వు భావించినా ఫరవాలేదు” అని కథ చెప్పాను. అజర్కైవాన్ అని పేరు పొందిన ఫకీరు ఉండేవాడు. ఆయన బోధనలు వినడానికి దేశదేశాల నుంచి జనం వచ్చేవాళ్ళు. ఎన్నో సందేహాలతో, సమస్యలతో వచ్చేవాళ్లు. తమబాధలన్నీ ఆయన్తో చెప్పుకునే వాళ్ళు. ఆయన శాంతంగా వాళ్ళు బాధల్ని వినేవారు. విశ్లేషించేవాడు. వీలయినంతగా వాటికి పరిష్కారాలు చెప్పేవాడు. వాటిని జనం సంతృప్తిగా వెళ్లేవాళ్లు. ఒకరోజు ఒకధనవంతుడు ఆ ఫకీరు దగ్గరకు వచ్చాడు. ఆ ధనవంతుని వద్ద అంతులేని సంపద ఉంది. తరతరాలు కూచుని తిన్నా తరగని సంపద ఉంది. తన సంపద వల్ల అతనికి శాంతి సుఖాలు లేవు. ఆనందంలేదు. ఉన్నట్లుండి వాటిపట్ల అతనికి విరక్తి కలిగింది. అతను ఫకీరు దగ్గరికి వచ్చి ”అయ్యా! నేను జీవితంలో విసిగిపోయాను. అలిసిపోయాను. నిరంతరం శ్రమించి అంతులేని సంపదను కూడబెట్టాను. ఇప్పుడు అన్నీ వదులుకోవాలనుకుంటున్నాను. నాకు ఆస్తులు,అంతస్తులు అన్నీ ఉన్నాయి. పేరు, పలుకుబడి అన్నీ ఉన్నాయి. కానీ ఇవేవీ నాకు శాంతిని ఇవ్వడంలేదు. పైగా ఆటంకంగా ఉన్నాయనిపిస్తోంది. నాధనం, భూములు, నగలు, వీటన్నిటినీ వదిలేస్తున్నాను. చివరికి నాభార్యా బిడ్డల్ని కూడా వదిలిపెట్టాలనుకుంటున్నాను. సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాను. మీరేమంటారు? దయచేసిమనవి చేయండి” అన్నాడు. ఫకీరు అంతా విన్నాడు. ”మంచిదే! మంచిపని చేస్తున్నావు” అన్నాడు. ఆ మాటలకు ధనవంతుడు ఆనందపడిపోయి తన జన్మ ధన్యమయిందనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పది రోజులుగడిచాయి. ఆ ధనవంతుడు మళ్లీ ఫకీరు దగ్గరకి వచ్చాడు. ”స్వామీ! నేను నా ఆస్థిపాస్తులన్నీ పంపకం చేశాను. అన్నీ పద్ధతిగా నిర్వహించాను. ఇప్పుడు నేను ధరించే సన్యాసి వస్త్రాల్ని, బొంతని అన్నీసిద్ధం చేయిస్తున్నాను. అవి పూర్తికాగానే సన్యాసాన్ని స్వీకరించడానికి వస్తాను” అన్నాడు. ఫకీరు ఏమీ మాట్లాడలేదు. నేను ఆ యువకుడితో ఈ కథ చెప్పి ఇప్పుడు చెప్పు. ”నువ్వు సన్యాసాన్ని స్వీకరించడానికి అర్హుడివా?” అన్నాను. ఆ యువకుడు మౌనంగా వెళ్లిపోయాడు. సన్యాసమంటే ఆలోచనల్లో మార్పు పరివర్తన కలగడం, సంసారం, సన్యాసం వేరువేరు కావు. అవి ఒకే నాణేనికి రెండువేపులు.

నిజమైన సంపద

నిజమైన సంపద

నేనొక సంపన్నుడి ఇంట్లో ఒకరోజు బస చేశాను.  అతను రోజంతా సంపాదనలో మునిగిఉండేవాడు.  రాత్రంతా సంపాదించింది లెక్కబెట్టుకుని దాచుకునేవాడు.  దాంతో అతనికి నిద్రా,నీళ్లూ ఉండేవి కావు.  ఉదయానికి అతని ముఖం పేలవంగా ఉండేది.  అశాంతిగా ఉండేవాడు.  అవిశ్రాంతంగా ఉండేవాడు.  అతన్ని చూసి నాకు జాలి కలిగింది.  ఎవరయితే డబ్బు వెంట, కీర్తి వెంట పరుగులు పెడతారో వాళ్లకు శాంతి ఉండదు.  అతనికో కథ చెప్పాను.  ఒక గొప్ప సన్యాసి ఒక నగరానికి వచ్చాడు.  సన్యాసులు ఎక్కడ బడితే అక్కడ ఉంటారు.  ఇతను భిన్నమైన వాడు.  అతని ముఖంలో గొప్ప ప్రశాంతత రూపుకట్టి ఉండేది.  ఎవరు ఆయన దగ్గరికి వెళతారో ఆయన ప్రశాంతత వాళ్ళను కూడా చుట్టుముట్టేది.  ప్రాపంచిక రాగద్వేషాలను దాటిన మహా ఆనందమేదో ఆయన్లో ఉండేది.  అందరూ మంత్రముగ్ధులయి ఆయన మాటల్ని వినేవారు.  ఆయన్లో ఉన్న ఆనంద పరిమళం ఎలాంటిదంటే అది నిశ్చల అరణ్యాలలో ఉంటుంది.  నిర్మల నక్షత్రాకాశంలో మాత్రమే ఉంటుంది.  స్వర్గ సంబంధమయిన స్వచ్ఛత, ఆహ్లాదం ఆయన వర్చస్సులో కనిపిస్తుంది.  ఆయన గొప్ప సంపన్నుడు.  ఆ సంపద భౌతిక సంపదకాదు.  అది ఆత్మధనం.  మన దగ్గరున్న సంపద ఇస్తే తరిగిపోతుంది.  ఆయన దగ్గరున్న సంపద అలాంటిదికాదు.  అది యిస్తూ ఉంటే పెరుగుతూ పోతుంది.  ఆయన శ్వాసలో కూడా ఒక సంగీతముండేది.  ఆయన మాట్లాడినా, మౌనంగా ఉన్నా ఆనందం తాండవించేది.  మామూలు మనుషుల మనసు గర్వంతో నిండిపోయి ఉంటుంది.  డబ్బుతో, కీర్తితో, పదవుల్తో నిండిపోయి ఉంటుంది.  కానీ అవన్నీ పసివాళ్ళ చేష్టలు.ఆ సన్యాసి మధుర వాక్కులు వినడానికి ఎందరో వచ్చేవాళ్లు.  విని తరించేవాళ్లు.  ఆ నగరంలో  కాత్యాయని అనే సంపన్నురాలయిన స్త్రీ ఉండేది.  ఆమె తన చెలికత్తెతో కలిసి వచ్చి ఆ సన్యాసి ప్రవచనాలని విని పరవశించింది.   సాయంత్రం కావస్తోంది.   ఆయన మధుర వాక్కులు వింటూ ఆమె మైమరచిపోయింది.  ప్రాపంచిక బంధనాలన్నీ పటాపంచలయిపోయాయి.  అర్ధనిమీల నేత్రాలతో ఆమె ఆనందాలోకాల్లో తేలిపోతుంది.  చీకటి పడుతోంది.  తను వెళ్ళి ఇంట్లో దీపం వెలిగించి వస్తానని చెలికత్తె వెళ్లింది.  వెళ్లిందల్లా కాసేపటికి పరిగెత్తుకుంటూ వచ్చి ”అమ్మా! ఘోరం జరిగిపోయింది.  మనం   లేనిది చూసి దొంగలు ఇల్లంతా దోచుకున్నారు” అంది.  కానీ కాత్యాయని అవేవీ వినేస్థితిలో లేదు.  సన్యాసి మాటలు వింటూ  ఆనందభాష్పాలు రాలుస్తోంది.  చెలికత్తె ”అమ్మా! వాళ్ళు మన బంగారు నగలన్నీ దోచుకెళ్లారు” అని ఆందోళనగా అంది.
కాత్యాయని చెలికెత్తె కేసి చూసి, నువ్వు అంతగా బాధపడాల్సిన పని లేదు.  ఎందుకంటే వాళ్ళు దోచుకెళ్లినవి నిజమైన బంగారు ఆభరణాలు కావు.  అవి నిజమైన సంపద కాదు.  ఈ మహానుభావుడు ఏం చెబుతున్నాడో అది నిజమైన ఐశ్వర్యం.  మన నగలు దోచుకున్న దొంగలు ఈ రోజుకాకపోయినా రేపటికయినా ఆ సంగతి తెలుసుకుంటారు. ఏది దోచుకోడానికి వీలుపడదో అదే నిజమైన సంపద. ఆసంపద ఈ మహాపురుషుడి దగ్గర ఉంది.  అది మనకందరకు పంచుతున్నాడు” అంది.  అక్కడే ఉన్న దొంగల నాయకుడు ఆమె మాటలు విని దిగ్భ్రమ చెందాడు.  ఆ మాటలు అతని గుండెల్లో గుచ్చుకున్నాయి.  పరివర్తన తెచ్చాయి.  వెంటనే తన తోటి దొంగలతో దోచుకున్నదంతా తీసుకెళ్లి కాత్యాయని ఇంట్లో వదిలిపెట్టి రమ్మని చెప్పాడు.
ఈ కథ విని నేను బస చేసిన ఇంటి యజమాని తన దగ్గరున్న సంపద నిజమైన సంపద కాదని గ్రహించాడు.  అతని జీవితంలో మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయాడు.