Friday, 26 May 2017

నిజమైన సంపద

నిజమైన సంపద

నేనొక సంపన్నుడి ఇంట్లో ఒకరోజు బస చేశాను.  అతను రోజంతా సంపాదనలో మునిగిఉండేవాడు.  రాత్రంతా సంపాదించింది లెక్కబెట్టుకుని దాచుకునేవాడు.  దాంతో అతనికి నిద్రా,నీళ్లూ ఉండేవి కావు.  ఉదయానికి అతని ముఖం పేలవంగా ఉండేది.  అశాంతిగా ఉండేవాడు.  అవిశ్రాంతంగా ఉండేవాడు.  అతన్ని చూసి నాకు జాలి కలిగింది.  ఎవరయితే డబ్బు వెంట, కీర్తి వెంట పరుగులు పెడతారో వాళ్లకు శాంతి ఉండదు.  అతనికో కథ చెప్పాను.  ఒక గొప్ప సన్యాసి ఒక నగరానికి వచ్చాడు.  సన్యాసులు ఎక్కడ బడితే అక్కడ ఉంటారు.  ఇతను భిన్నమైన వాడు.  అతని ముఖంలో గొప్ప ప్రశాంతత రూపుకట్టి ఉండేది.  ఎవరు ఆయన దగ్గరికి వెళతారో ఆయన ప్రశాంతత వాళ్ళను కూడా చుట్టుముట్టేది.  ప్రాపంచిక రాగద్వేషాలను దాటిన మహా ఆనందమేదో ఆయన్లో ఉండేది.  అందరూ మంత్రముగ్ధులయి ఆయన మాటల్ని వినేవారు.  ఆయన్లో ఉన్న ఆనంద పరిమళం ఎలాంటిదంటే అది నిశ్చల అరణ్యాలలో ఉంటుంది.  నిర్మల నక్షత్రాకాశంలో మాత్రమే ఉంటుంది.  స్వర్గ సంబంధమయిన స్వచ్ఛత, ఆహ్లాదం ఆయన వర్చస్సులో కనిపిస్తుంది.  ఆయన గొప్ప సంపన్నుడు.  ఆ సంపద భౌతిక సంపదకాదు.  అది ఆత్మధనం.  మన దగ్గరున్న సంపద ఇస్తే తరిగిపోతుంది.  ఆయన దగ్గరున్న సంపద అలాంటిదికాదు.  అది యిస్తూ ఉంటే పెరుగుతూ పోతుంది.  ఆయన శ్వాసలో కూడా ఒక సంగీతముండేది.  ఆయన మాట్లాడినా, మౌనంగా ఉన్నా ఆనందం తాండవించేది.  మామూలు మనుషుల మనసు గర్వంతో నిండిపోయి ఉంటుంది.  డబ్బుతో, కీర్తితో, పదవుల్తో నిండిపోయి ఉంటుంది.  కానీ అవన్నీ పసివాళ్ళ చేష్టలు.ఆ సన్యాసి మధుర వాక్కులు వినడానికి ఎందరో వచ్చేవాళ్లు.  విని తరించేవాళ్లు.  ఆ నగరంలో  కాత్యాయని అనే సంపన్నురాలయిన స్త్రీ ఉండేది.  ఆమె తన చెలికత్తెతో కలిసి వచ్చి ఆ సన్యాసి ప్రవచనాలని విని పరవశించింది.   సాయంత్రం కావస్తోంది.   ఆయన మధుర వాక్కులు వింటూ ఆమె మైమరచిపోయింది.  ప్రాపంచిక బంధనాలన్నీ పటాపంచలయిపోయాయి.  అర్ధనిమీల నేత్రాలతో ఆమె ఆనందాలోకాల్లో తేలిపోతుంది.  చీకటి పడుతోంది.  తను వెళ్ళి ఇంట్లో దీపం వెలిగించి వస్తానని చెలికత్తె వెళ్లింది.  వెళ్లిందల్లా కాసేపటికి పరిగెత్తుకుంటూ వచ్చి ”అమ్మా! ఘోరం జరిగిపోయింది.  మనం   లేనిది చూసి దొంగలు ఇల్లంతా దోచుకున్నారు” అంది.  కానీ కాత్యాయని అవేవీ వినేస్థితిలో లేదు.  సన్యాసి మాటలు వింటూ  ఆనందభాష్పాలు రాలుస్తోంది.  చెలికత్తె ”అమ్మా! వాళ్ళు మన బంగారు నగలన్నీ దోచుకెళ్లారు” అని ఆందోళనగా అంది.
కాత్యాయని చెలికెత్తె కేసి చూసి, నువ్వు అంతగా బాధపడాల్సిన పని లేదు.  ఎందుకంటే వాళ్ళు దోచుకెళ్లినవి నిజమైన బంగారు ఆభరణాలు కావు.  అవి నిజమైన సంపద కాదు.  ఈ మహానుభావుడు ఏం చెబుతున్నాడో అది నిజమైన ఐశ్వర్యం.  మన నగలు దోచుకున్న దొంగలు ఈ రోజుకాకపోయినా రేపటికయినా ఆ సంగతి తెలుసుకుంటారు. ఏది దోచుకోడానికి వీలుపడదో అదే నిజమైన సంపద. ఆసంపద ఈ మహాపురుషుడి దగ్గర ఉంది.  అది మనకందరకు పంచుతున్నాడు” అంది.  అక్కడే ఉన్న దొంగల నాయకుడు ఆమె మాటలు విని దిగ్భ్రమ చెందాడు.  ఆ మాటలు అతని గుండెల్లో గుచ్చుకున్నాయి.  పరివర్తన తెచ్చాయి.  వెంటనే తన తోటి దొంగలతో దోచుకున్నదంతా తీసుకెళ్లి కాత్యాయని ఇంట్లో వదిలిపెట్టి రమ్మని చెప్పాడు.
ఈ కథ విని నేను బస చేసిన ఇంటి యజమాని తన దగ్గరున్న సంపద నిజమైన సంపద కాదని గ్రహించాడు.  అతని జీవితంలో మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయాడు.

No comments:

Post a Comment